ఆ మూడు హామీలు అమలు చేయాలి
ఆదేశించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల్లో తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఇప్పటికే రెండు అమలవుతున్నాయని అన్నారు. తాజాగా మరో రెండు హామీలను వెంటనే అమలు చేయాలని సీఎస్ ను ఆదేశించారు.
హామీల అమలుపై సుదీర్ఘ సమీక్ష చేపట్టారు సీఎం. పేదలకు రూ.500 సబ్సిడీ ధరతో వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీతో పాటు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ పథకం సరఫరా యుద్ద ప్రాతిపదికన ఆచరణ లోకి రావాలని స్పష్టం చేశారు సీఎం.
ఇందుకు సంబంధించి బడ్జెట్ లో అవసరమైన నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖకు సూచించారు . ఈ బడ్జెట్ లోనే హామీలకు సంబంధించి నిధులు కేటాయించాలని, అర్హులైన వారందరికీ లబ్ది చేకూరాలన్నారు రేవంత్ రెడ్డి. అర్హులైన ఏ ఒక్కరికీ నష్టం జరగ కూడదన్నారు. ప్రజా పాలనకు సంబంధించిన దరఖాస్తుల సమీక్షలో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం.
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు.