మిషన్ భగీరథ పనులపై విచారణ
ఆదేశించిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులు, చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకుంటున్న మిషన్ భగీరథ పథకం పనులపై వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఎవరి ప్రమేయం ఉందనేది తనకు పూర్తి నివేదిక ఇవ్వాలని స్పష్టంచేశారు సీఎం.
రాష్ట్రంలోని పల్లెల్లో స్వచ్ఛమైన తాగు నీరు అందించడంలో భాగంగా మిషన్ భగీరథ పేరుతో ఈ పథకాన్ని చేపట్టారు. భగీరథ అవకతకవలపై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఇదిలా ఉండగా దాదాపు రూ. 7 వేల కోట్లకు పైగా అవినీతి చోటు చేసుకుందని భావిస్తున్నారు.
అవినీతి ఆరోపణల వెనుక నిజా నిజాలు తెలుసుకుని, ప్రమేయం ఉన్నవారిని బుక్ చేసేందుకు విచారణ జరగాల్సి ఉందన్నారు. తాగు నీటి పేరుతో భారీ ఎత్తున దందా జరిగిందని విమర్శలు ఉన్నాయి. మరో వైపు ఇదే మిషన్ భగీరథకు అన్నీ తానై వ్యవహరించారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్.