తెలంగాణపై దేవుడి కృప ఉండాలి
ఆకాంక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంపై జగన్నాథుడు కరుణ కటాక్షం చూపించాలని కోరారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా పూరీ జగన్నాథుడి ఉత్సవం కొనసాగుతోంది. కోట్లాది మంది ప్రజలు ఆయనను తమ దేవుడిగా కీర్తిస్తారు. పూజిస్తారు..ఆరాధిస్తారు.
ఇదిలా ఉండగా ఆదివారం హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున జగన్నాథుడి యాత్రను నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
సమాజం ప్రశాంతంగా, సస్య శ్యామలంగా ఉండాలనే ఉద్దేశంతో ఇస్కాన్ సంస్థ కృషి చేస్తోందని కొనియాడారు . వారి ప్రార్థనలు ఫలించాలని కోరారు. తెలంగాణపై ఆ దైవం చల్లని చూపులు ప్రసరించేలా చేయాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.
జగన్నాథుడి రథోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని తమ ప్రభుత్వం ఆచరిస్తుందని చెప్పారు. మాదక ద్రవ్యాలు, ఇతర జాడ్యాల నుంచి తెలంగాణ సమాజం విముక్తి పొందడానికి ఇలాంటి మంచి కార్యక్రమాలు ఉపకరిస్తాయని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు.