వందే భారత్ రైలు ప్రారంభం
పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ మంగళవారం ప్రతిష్టాత్మకమైన వందే భారత్ రైలును ప్రారంభించారు. ఈ రైలు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు నడుస్తుంది. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును వర్చువల్ గా ప్రధాని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైలును ప్రారంభించిన అనంతరం నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలో రైల్వే వ్యవస్థను మరింత ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు శర వేగంగా దూసుకు వెళుతున్నాయని చెప్పారు.
ప్రతి రోజూ వేలాది మంది ప్రయాణీకులు ఈ వందే భారత్ రైళ్ల ద్వారా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాల్గొనడంపై సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఇలాంటి సంబంధాలు కలిగి ఉండడం మంచి పద్దతి అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఈ సందర్బంగా పీఎం మోదీకి ధన్యవాదాలు తెలిపారు.