సర్కార్ బడులు దేశానికి ఆదర్శం కావాలి
పిలుపునిచ్చిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – నేను సర్కార్ బడిలోనే చదువుకున్నా. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన కంపెనీలలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారేనని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో పంతుళ్లతో ఆత్మీయ సమ్మేళనం చేపట్టారు.
ప్రైవేట్ పాఠశాలలకు పోటీగా ప్రభుత్వ పాఠశాలలు ఎదగాలని, ఇందుకు అవసరమైన వసతి సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని బడుల నుంచి చదువుకున్న వారు వేలాది మంది టాప్ కంపెనీలలో కొనసాగుతున్నారని , వారిని చూసినప్పుడు, మాట్లాడినప్పుడు తనకు ఎంతో ఆనందం కలుగుతుందన్నారు.
తెలంగాణ భవితవ్యం సర్కారు బడుల్లోనే ఉందన్నారు. పంతుళ్లకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రేవంత్ రెడ్డి. 30 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 26 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును మీ చేతుల్లో పెట్టామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనలో టీచర్లు పోషించిన పాత్ర గొప్పదన్నారు. రాష్ట్రం ఏర్పడితే విద్యా విధానం బాగు పడుతుందని అనుకున్నామని, కానీ గత సర్కార్ ఏ మాత్రం టీచర్లను పట్టించు కోలేదని, విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి.
కోదండరాం, హరగోపాల్, చుక్కా రామయ్య లాంటి వాళ్లకు గొప్ప గౌరవం దక్కుతుందని అనుకున్నాం. కానీ వారిని కావాలని పక్కన పెట్టారంటూ ఆరోపించారు. ఈసారి బడ్జెట్ లో విద్యా రంగానికి 10 శాతం కేటాయించాలని, కానీ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 7.3 శాతం కేటాయించడం జరిగిందన్నారు. టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు సీఎం.