సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా – సీఎం రేవంత్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గంలోని మొగిలిగిద్ద పాఠశాలను సందర్శించారు. ఆ బడి సాధించిన ప్రగతిని చూసి సంతోషానికి లోనయ్యారు. ఒకనాడు చదువు కోవాలంటే ఇబ్బందులు ఉండేవన్నారు. కానీ తరాలు మారినా స్కూల్ మాత్రం మార లేదన్నారు. ఇక్కడ చదువుకున్న వారు ఎందరో ఉన్నత స్థానాల్లో నిలిచారని ప్రశంసించారు.
మొగిలిగిద్ద చెక్కు చెదరని జ్ఞాపకమని, వేలాది ప్రభుత్వ బడులకు స్పూర్తిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని తండాలు, గూడేలు, మారుమూల పల్లెల నుండి విద్యా వ్యవస్థను పునరుద్ధరించు కోవాలన్న నా సంకల్పానికి ఒక స్ఫూర్తిగా అనిపించిందని చెప్పారు ఎనుముల రేవంత్ రెడ్డి.
150 ఏళ్లుగా విద్యా చైతన్యాన్ని వెదజల్లుతున్న మొగిలిగిద్ద పాఠశాలకు, దశాబ్దాలుగా అందుకు సహకరిస్తూ వస్తోన్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తున్నానని అన్నారు. ఆయా పాఠశాలలకు చెందిన పంతుళ్లు, హెడ్మాస్టర్లు, విద్యార్థులు ఈ బడిని ఒక్కసారైనా సందర్శించాలని సూచించారు సీఎం.
దీని వల్ల ఎంతో స్పూర్తి పొందుతారని అన్నారు.
ఏది కోల్పోయినా తిరిగి తెచ్చుకోగలమని, కానీ విలువైన కాలాన్ని కోల్పోతే మాత్రం తీవ్రంగా నష్ట పోతామని చెప్పారు రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం బడులు, కాలేజీల అభివృద్దికి కృషి చేస్తున్నామన్నారు.