అగ్ని మాపక సిబ్బంది సేవలు భేష్
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో అగ్ని మాపక సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఆదివారం నానక్ రామ్ గూడలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రారంభించిన అనంతరం ప్రసంగించారు.
ప్రమాదం జరిగినపుడు అందరి కంటే ముందుండేది ఫైర్ డిపార్ట్ మెంట్ అని కొనియాడారు. ప్రజల రక్షణ కోసం ఫైర్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పోరాడుతారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంతో హైదరాబాద్ నగరం పోటీ పడుతోందని చెప్పారు.
నగరంలో శాంతి భద్రతలు సరైన విధంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయన్నారు. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ఉందన్నారు. గత ముప్పై ఏళ్లలో రాజకీయాలు ఎలా ఉన్నా నగర అభివృద్ధి కొనసాగిందన్నారు.
హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే..మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తామని అన్నారు రేవంత్ రెడ్డి.
త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకు రాబోతున్నామని చెప్పారు. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతామన్నారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని 25 వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.
ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నామని తెలిపారు. ఫార్మా సిటీలు కాదు.. ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తామన్నారు. తమ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉందన్నారు.