ఆర్ఎస్పీ ఆవేదన సీఎం స్పందన
త్వరలోనే మిగతా పోస్టుల భర్తీ
హైదరాబాద్ – బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేవనెత్తిన సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వెంటనే ఖాళీలను భర్తీ చేయాలని కోరారు ట్విట్టర్ వేదికగా బీఎస్పీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఈ మేరకు రేవంత్ రెడ్డి స్పందించారు. వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గడిచిన పదేళ్లలో తెలంగాణ యువత ఎంత దగా పడిందో, వారి భవిష్యత్తు మీద గత ప్రభుత్వం ఏ విధంగా కోలుకోలేని దెబ్బ తీసిందో మనందరం చూసాం. ఆ దశాబ్ద కాల విషాదాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, మన యువత భవితను పునర్నిర్మించాలనే సంకల్పంతో తమ ప్రభుత్వం నిర్విరామంగా పని చేస్తోందని స్పష్టం చేశారు సీఎం.
గురుకుల టీచర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి మీరు లేవనెత్తిన విషయాలను, ఇచ్చిన సూచనలను నిశితంగా పరిశీలించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామన్నారు.
పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా తెలంగాణ పునర్నిర్మాణానికై ఎవరు కలిసి వచ్చినా వారి విలువైన సూచనలు, సహకారం తీసుకోవడానికి, వారితో కలిసి పనిచేయడానికి ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.