సర్కారు డడుల్లో సమూల మార్పులు
ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ప్రభుత్వ పాఠశాలల్లో సమూలమైన మార్పులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవసరమైన అన్ని మౌళిక సదుపాయాలు కల్పిస్తే బడుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు. ఎంసీఆర్‌హెఆర్డీలో ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం సమీక్షించారు. వేసవి సెలవులు ముగిసేలోగా వసతులు మెరుగు పరచడానికి కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంపై విద్యావేత్తలు, మేధావులతో చర్చించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో స్పష్టమైన మార్పు కనిపించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించారు సీఎం.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ అందించాలని ఆదేశించారు. విద్యార్థులకు యూనిఫామ్‌తో పాటు పాఠశాలల్లో మౌళిక సదుపాయాల ఏర్పాటు, పర్యవేక్షణను స్వయం సహాయక మహిళా సంఘాలకు అప్పగించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ఇలాంటి చర్యల వల్ల పాఠాశాలలపై నిరంతర పర్యవేక్షణ ఉండటంతో పాటు మహిళలకు ఆర్థికంగా చేయూతను అందించినట్లు అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా గ్రీన్ ఛానెల్ ద్వారా పాఠశాలల్లో మౌళిక సదుపాయాల కోసం నిధులు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు.
డిజిటల్ తరగతి గదులు ఏర్పాటు చేయడం, టీ-శాట్ ద్వారా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో పాఠాలు చెప్పించడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల స్థితిగతులను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని సీఎం సూచించారు.