అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సీఎం
భారీ వర్షాలపై రేవంత్ రెడ్డి ఆరా
హైదరాబాద్ – రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై అందరూ అలెర్ట్‌గా ఉండాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి ఉన్నత స్థాయి అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, హైడ్రా, నీటి పారుదల శాఖ అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.
అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు రద్దు చేసుకొని వెంటనే విధుల్లో నిమగ్నం కావాలని అన్నారు సీఎం. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో ఉంటూ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సీఏంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలని చెప్పారు. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకి రావొద్దని ముఖ్యమంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు.
మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ అవసరమైన సహాయక కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. 24 గంటలు అలెర్ట్‌గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.