DEVOTIONAL

శాంతం స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం – సీఎం

Share it with your family & friends

ఆధునిక జీవితంలో ప్ర‌శాంతత ముఖ్యం

హైద‌రాబాద్ – యాంత్రికంగా మారిన ఆధునిక జీవితంలో మ‌నుషులకు ప్ర‌శాంతత క‌రువై పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సమాజాన్ని శాంతియుత మార్గంలో నడిపించడంలో బ్రహ్మ కుమారీస్ సంస్థ ఆశయాలకు దగ్గరగా తెలంగాణ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని తెలిపారు.

రైతుల సంక్షేమం, డ్రగ్స్ వంటి మహమ్మారుల నుంచి యువతను కాపాడి, వారికి సాధికారత నేర్పడంలో బ్ర‌హ్మ కుమారీస్ కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని కొనియాడారు ఎ. రేవంత్ రెడ్డి. మౌంట్ అబూ (రాజస్థాన్) తర్వాత హైదరాబాద్ లో బ్రహ్మ కుమారీల శాంతి సరోవర్ ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు.

హైదరాబాద్ గచ్చిబౌలిలోని “బ్రహ్మ కుమారీస్ – శాంతి సరోవరం” 20వ వార్షికోత్సవ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు. రైతుల ఆత్మహత్యల్ని నివారించి, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం రైతుల రుణమాఫీకి రూ. 31వేల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు.

యువత పెడదారులు పట్టకుండా, డ్రగ్స్ పేరు వింటేనే భయపడేలా నార్కోటిక్స్ టీమ్స్ ద్వారా మాదక ద్రవ్యాల నిర్మూలనకు కృషి చేస్తున్నామన్నారు.

యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించామని, ప్రముఖ పారిశ్రామికవేత్తల సారధ్యంలో ఈ యూనివర్సిటీ నడుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

శాంతి సరోవరం లీజ్ పొడిగింపుతో సహా అన్ని విషయాల్లో బ్రహ్మ కుమారీలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. మౌంట్ అబూలో జరగబోయే బ్రహ్మ కుమారీల గ్లోబల్ సదస్సులో పాల్గొంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.