21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం ఉండాలి – సీఎం
శాసన సభలో తీర్మానం చేస్తామని ప్రకటన
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో 21 ఏళ్లకే యువతీ యువకులు పోటీ చేసేందుకు అర్హులు అయ్యేలా తాము శాసన సభలో తీర్మానం చేస్తామని సంచలన ప్రకటన చేశారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
సీఎం చేసిన ప్రకటన ప్రత్యేకతను సంతరించుకుంది. బాల బాలికలు చదువుకునేందుకు తమ ప్రభుత్వం భారీ ఎత్తున నిధులను కేటాయించిందని చెప్పారు. ఇటీవలే విద్యా సంస్థలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 40 శాతం పెంచడం జరిగిందన్నారు.
ప్రతి పేద బిడ్డ చదువుకోవాలి..పైకి రావాలి..ప్రస్తుత ప్రపంచంతో పోటీ పడాలని పిలుపునిచ్చారు అనుముల రేవంత్ రెడ్డి. విద్యార్థులు చదువుపై ఫోకస్ పెట్టాలి తప్పా చెడు వ్యసనాలకు బలి కావద్దని సూచించారు. జీవితంలో అత్యంత విలువైన సమయం ఏదైనా ఉందంటే అది బాల్యం మాత్రమేనని స్పష్టం చేశారు.
ఈ మధ్యన డ్రగ్స్ కు ఎక్కువగా అలవాటు పడుతున్నారని , ఈ విషయం తెలిసి తాను తీవ్ర ఆవేదనకు గురైనట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మీపై ఆధారపడి ఉందన్నారు. తల్లిదండ్రులు మీపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారని వారి ఆశలను నెరవేర్చేందుకు కష్టపడాలని సూచించారు.
గత ప్రభుత్వం విద్యా రంగాన్ని పట్టించు కోలేదని, కానీ తాము వచ్చాక రాష్ట్ర బడ్జెట్ లో ఏకంగా రూ. 21,000 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి.