ఇందిరమ్మను మరిచి పోలేం
హైదరాబాద్ – ఆరు నూరైనా సరే తెలంగాణలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. జహీరాబాద్ లో భారీ ఎత్తున జనం చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ, ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు మరోసారి బీఆర్ఎస్ , బీజేపీలపై . కేసీఆర్, మోదీ ఇద్దరూ జిగిరీ దోస్తులన్నారు. పైకి విమర్శలు చేసుకుంటూ లోపట దోస్తానా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తాము ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేశామన్నారు. వచ్చే ఆగస్టు 13 లోపు రైతులకు సంబంధించిన రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు ఎనుముల రేవంత్ రెడ్డి.
బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ పనై పోయిందన్నారు. ఇక కారు గ్యారేజ్ కే పరిమితం కాక తప్పదన్నారు. ఇక బీజేపీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు రేవంత్ రెడ్డి. కుల, మతం పేరుతో రాజకీయం చేయడం తప్పితే దేశానికి ఒక్కటన్నా మంచి పని చేసిందా అని ప్రశ్నించారు.