సీఎం ఎ. రేవంత్ రెడ్డి పిలుపు
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సైబర్ సెక్యూరిటీ విషయంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేస్తామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ హెచ్ఐసీసీలో సైబర్ సెక్యూరిటీ కాన్ క్లేవ్ 2025 (షీల్డ్)ను ప్రారంభించారు. పోలీస్, ఐటీ నిపుణులతో కూడిన సేవలను వినియోగించు కుంటామని చెప్పారు.
సైబర్ క్రైం దేశ ఆర్థిక వ్యవస్థకే పెను సవాల్ గా మారిందన్నారు. గత ఏడాది దేశ వ్యాప్తంగా రూ. 22,812 కోట్లు దోచుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేరం జరిగాక చర్యలు తీసుకోవడం కాకుండా… నేర నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు రేవంత్ రెడ్డి.
సైబర్ క్రైం విషయంలో ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనికి ప్రభుత్వం వైపు నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. తెలంగాణను సైబర్ నేర రహిత రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో ముందుకు వెళతామని చెప్పారు సీఎం.
తమ ప్రభుత్వం కొలువు తీరాక నైపుణ్యాభివృద్దిపై దృష్టి సారించామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యం కలిగిన విద్యార్థులను ఎంపిక చేసి పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.