అభివృద్దికి సర్కార్ పెద్దపీట – సీఎం
పాత బస్తీ కాదు సిసలైన హైదరాబాద్
హైదరాబాద్ – ఇది పాత బస్తీ కానే కాదని సిసలైన హైదరాబాద్ అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నగర అభివృద్దికి తమ సర్కార్ కట్టుబడి ఉందన్నారు. ఇది తమ బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో అవసరమైన అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని హామీ ఇచ్చారు.
ఎంజీబీఎస్ స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. హైదరాబాద్ నగర ప్రతిష్టను నిలబెట్టడానికి అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు తప్ప మిగతా సమయంలో అభివృద్ధి పైనే దృష్టి ఉంటుందని స్పష్టం చేశారు.
పేద, మధ్యతరగతి ప్రజల కోసం మెట్రో ఫేజ్-2 ను తీసుకొస్తున్నామని తెలిపారు. ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, మైలార్ దేవర్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరిస్తున్నామని చెప్పారు. చాంద్రాయణగుట్టలో మెట్రో జంక్షన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని ప్రకటించారు. దీనికోసమే అక్బరుద్దీన్‌తో కలిసి లండన్ థెమ్స్ నగరాన్ని సందర్శించామని తెలిపారు. చంచల్‌గూడ జైలును తరలించి విద్యార్థుల కోసం పాఠశాల, కళాశాలలు నిర్మిస్తామని అన్నారు.