చదువుపై దృష్టి సారించండి
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – జీవితంలో దేనినైనా సాధించాలంటే ముందు లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలని స్పష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. దేనిని కోల్పోయినా తిరిగి తెచ్చు కోవచ్చని కానీ కోల్పోయిన కాలాన్ని తెచ్చు కోలేమని అన్నారు. ప్రతి ఒక్కరికీ ముఖ్యమైన దశ బాల్యమని, ఈ సమయంలో ఎక్కువగా ఇతర అంశాలపై దృష్టి సారిస్తే విలువైన జీవితాన్ని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
విద్యార్థి దశ గొప్పదని, గతంలో తాము చదువుకునేందుకు నానా తంటాలు పడ్డామని కానీ ఇప్పుడు టెక్నాలజీ తీసుకు వచ్చిన మార్పులతో విద్యా రంగంలో కూడా పెను మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు.
హైదరాబాద్ లోని ఇబ్రహీంబాగ్ లో నిర్మించిన తెలంగాణ మైనారిటీ గురుకుల కళాశాల, పాఠశాల భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడినా సరే చదువును మాత్రం నిర్లక్ష్యం చేయొద్దంటూ విద్యార్థులకు సూచించారు.
మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చి దిద్దేది, విజయం సాధించేలా చేసేది, పది మందిలో గుర్తింపు తీసుకు వచ్చేది కేవలం మీ సంపద కాదని , మీ ఆస్తులు కావని మీ చదువు మాత్రమేనని అన్నారు ఎనుముల రేవంత్ రెడ్డి.