పోస్టుల భర్తీపై ఫోకస్ – సీఎం
త్వరలోనే 2 లక్షల కొలువులు
హైదరాబాద్ – తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల పోస్టులను యుద్ద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గత సర్కార్ పోస్టులు ఖాళీగా ఉన్నా నిర్లక్ష్యం చేసిందని, నిరుద్యోగులతో ఆడుకుందని ఆరోపించారు.
తాము ఎన్నికలలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు నియామక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ తాను మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఎంపిక చేశానని తెలిపారు.
నిన్నటి దాకా కేవలం కల్వకుంట్ల కుటుంబంలో మాత్రమే కొలువులు దక్కాయని కానీ తాము వచ్చాక ప్రజా పాలన సాగిస్తున్నామని చెప్పారు. గతంలో ముళ్ల కంచెలు, బారికేడ్లు ఉండేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
స్వేచ్ఛ, సమానత్వం, అందరికీ మాట్లాడే స్వేచ్ఛ కల్పిస్తున్న ఘనత తమ సర్కార్ దేనని పేర్కొన్నారు. ఇక తాము ఇచ్చిన మాట ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లోపు 2 లక్షల పోస్టులను భర్తీ చేసి తీరుతామన్నారు. నిరుద్యోగులు నిరాశకు గురి కావద్దని కష్టపడి చదువు కోవాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న 15 వేలకు పైగా పోలీసు నియామకాలకు సంబంధించి నియామక పత్రాలు అందజేశామన్నారు. తాజాగా గురుకులాల్లో నియమితులైన వారికి కూడా ఇవ్వడం జరిగిందన్నారు.