సీజనల్ వ్యాధులపై దృష్టి పెట్టండి – సీఎం
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష చేపట్టిన రేవంత్
హైదరాబాద్ – రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నియంత్రణపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల వైద్యాధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం చేపట్టారు.
డెంగ్యూ, మలేరియా, డయేరియా తదితర సీజనల్ వ్యాధులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.
ఆస్పత్రుల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిశుభ్రత పైనా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికి సంబంధించి పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఉమ్మడి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని కోరారు.
మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ఆయిల్ బాల్స్ వేసి దోమల పెరుగుదలను అరికట్టే చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన ప్రాంతాల్లో దోమ తెరలు పంపిణీ, వాడకంపై పలు సూచనలు చేశారు. ప్రభుత్వ హాస్టల్ లో తీసుకోవాల్సిన చర్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం.