NEWSTELANGANA

ప‌ల్లెల్లో విద్యా కాంతులు వెద‌జ‌ల్లాలి

Share it with your family & friends

సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ పాఠశాల విధానంలో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు.

ముఖ్యంగా గ్రామాల్లో 3 వ తరగతి వరకు అంగన్ వాడీ కేంద్రాల్లోనే విద్యా బోధన జరిగేలా, వాటిని ప్లే స్కూల్ తరహాలో తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌తో క‌లిసి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పై ఉన్నత విద్యా శాఖ అధికారులతో స‌మావేశం నిర్వ‌హించారు. విద్యా వ్యవస్థను పటిష్టం చేసే చర్యలపై చర్చించారు. వాటి ఏర్పాటుకు సంబంధించి ఆర్కిటెక్టులతో మాస్టర్ ప్లాన్ లపై వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు.

అంగన్ వాడీలలో ఇప్పుడున్న సిబ్బందికి అదనంగా విద్యా బోధన కోసం ప్రత్యేకంగా ఒక టీచర్ నియమించేలా ప్రణాళిక తయారు చేయాలని స్ప‌ష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. 3వ తరగతి వరకు అంగన్ వాడీ ప్లే స్కూల్ లో బోధన తర్వాత విద్యార్థులు 4 వ తరగతి నుంచి సెమీ రెసిడెన్షియల్ స్కూల్ లో చదివించాలన్నారు.

ఆయా గ్రామాల నుంచి విద్యార్థులు సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కు వెళ్లిరావడానికి ప్రభుత్వమే రవాణా సదుపాయం కల్పించాలని స్ప‌ష్టం చేశారు. ఈ ప్రతిపాదనలపై విద్యా వేత్తలతో చర్చించాక ప్లే స్కూల్, సెమీ రెసిడెన్షియల్ విధానాలపై పైలట్ ప్రాజెక్టుగా ఒకట్రెండు మండలాల్లో చేపట్టాలన్నారు సీఎం.

సీఎస్ఆర్ ఫండ్స్ తో పాఠశాల్లో వసతులు, సౌకర్యాల పెంపు కోసం దృష్టి సారించాలని అన్నారు.