ఉచిత బస్సు పథకంతో ఆదాయం
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై బీఆర్ఎస్ అనవసరంగా నోరు పారేసుకుంటోందని దీనిని తగ్గించుకుంటే మంచిదని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో బీఆర్ఎస్ , బీజేపీ, ఎంఐఎం సభ్యులు అడిగిన పలు అంశాలకు సంబంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రధానంగా తాము తీసుకు వచ్చిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అద్భుతమైన స్పందన లభిస్తోందని చెప్పారు.
ఇదిలా ఉండగా మహిళలు పెద్ద ఎత్తున మత పరమైన ప్రదేశాలకు వెళ్లారని , దీని వల్ల దేవాదాయ శాఖకు గణనీయమైన ఆదాయం లభించిందన్నారు సీఎం. నవంబర్ నెలలో రూ. 49.2 కోట్లు , డిసెంబర్ లో 93.24 కోట్లు, జనవరిలో రూ. 63 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు.
ఉచిత ప్రయాణం కారణంగా ఆర్టీసి బస్సులలో 15.2 కోట్ల మంది ప్రయాణం చేశారని తెలిపారు. కేసీఆర్ సభకు రాక పోవడం సభను అవమానించడమేనని అన్నారు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ సెంటిమెంట్ పేరుతో ఆయింట్ మెంట్ ను రాసే ప్రయత్నం చేసిందన్నారు. ఈనెల మొదటి తేదీన జీతం, పెన్షన్ కింద రూ. 4,800 కోట్లు జమ చేశామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు రేవంత్ రెడ్డి.