ఒలింపిక్స్ నిర్వహణకు ఛాన్స్ ఇవ్వండి
కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే 2036లో నిర్వహించే ఒలింపిక్స్ పోటీలను నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రానికి అవకాశం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. క్రీడలు, క్రీడల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్ గా తెలంగాణను తీర్చి దిద్దుతామని స్పష్టం చేశారు.
ఒకవేళ ఒలింపిక్స్ నిర్వహణ అవకాశం ఇండియాకు దక్కితే గనుక హైదరాబాద్‌ను ప్రధాన వేదికగా ఉంచేలా ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా అభ్యర్థించినట్లు వెల్లడించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తున్నామని ప్రకటించారు.
నగరంలో హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ముగింపు వేడుకలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. గచ్చిబౌలి జీఎంసీ బాలయోగి స్టేడియంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. హైదరాబాద్ మారథాన్ నిర్వాహకులను, స్పాన్సర్లను ఈ సందర్బంగా సీఎం అభినందించారు.
రాబోయే ఖేలో ఇండియా యువ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రిని కలిసి కోరామన్నారు రేవంత్ రెడ్డి. దేశంలో ఏ క్రీడలు జరిగినా తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడలకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.