విద్యా ప్రమాణాల పెంపుపై ఫోకస్
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా – గురుకులాల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రెసిడెన్షియల్ స్కూళ్లలో నాణ్యమైన విద్య, రుచికరమైన ఆహారాన్ని అందిస్తామని అన్నారు. డైట్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థులకు అండగా నిలిచామని అన్నారు. గత 16 ఏళ్లలో ఒక్కసారి కూడా కాస్మోటిక్ ఛార్జీలు పెంచ లేదని కానీ తాము వచ్చాక పెంచామన్నారు.
శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిల్కూరులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ లో కామన్ డైట్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.
ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, ఆహారం, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ధృడ సంకల్పంతో పని చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మట్టిలో మాణిక్యాలుగా తయారు కావాలని కోరారు ఎ. రేవంత్ రెడ్డి.
వారిని అద్భుతంగా తీర్చిదిద్ది ..తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములను చేస్తామని ప్రకటించారు . పిల్లలు చదువుపై ఫోకస్ పెట్టాలని సూచించారు. విద్యతోనే వికాసం అలవడుతుందన్నారు.