స్పష్టం చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణపై సమీక్ష చేపట్టారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని స్పష్టం చేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు (36.8 కి.మీ), రాయదుర్గం-కోకాపేట నియోపొలిస్ (11.6 కి.మీ), ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ), మియాపూర్-పటాన్‌చెరు (13.4 కి.మీ), ఎల్‌బీ నగర్-హయత్ నగర్ (7.1 కి.మీ) మొత్తం 76.4 కి.మీ.ల విస్తరణకు రూ.24,269 కోట్ల అంచనాలతో డీపీఆర్‌ను కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు.
కేంద్రం నుంచి అనుమతులు రాగానే పనులు ప్రారంభించేందుకు సన్నద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీ వరకు 40 కి.మీ మేర మెట్రో విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు రేవంత్ రెడ్డి.
దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్తు నగర విస్తరణ అవసరాల దృష్ట్యా మెట్రోను మీర్ ఖాన్ పేట వరకు పొడిగించాలని పేర్కొన్నారు. ఈ కీలక సమావేశంలో సీఎస్ శాంతి కుమార్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.