మాదిగల సమస్యలు పరిష్కరిస్తాం
ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – మాదిగలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శనివారం జరిగిన గ్లోబల్ మాదిగ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ విధానం స్పష్టంగా తెలియజేశామని చెప్పారు. సుప్రీంకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చేలా చేశామన్నారు సీఎం.
ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఒక స్పష్టమైన ప్రకటన చేశారని, మాదిగలకు సంబంధించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉన్న మాదిగ ఉపకులాల రిజర్వేషన్ల కేసులో బలమైన వాదనలు వినిపించేలా దామోదర రాజనర్సింహ నేతృత్వంలో న్యాయవాదులను నియమించామని అన్నారు సీఎం .
సుప్రీంకోర్టులో తీర్పు దానంతట అదే రాలేదని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో క్రియాశీల పాత్ర పోషించిందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తూచా తప్పకుండా అమలు చేస్తుందని శాసనసభ వేదికగా మేం స్పష్టంగా ప్రకటించామన్నారు.
తెలంగాణ సమస్యలా ఈ సమస్య జఠిలం అయిందన్నారు. కానీ ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మీ వాదనలో బలం ఉంది.. మీకు న్యాయం చేయాలన్న ఆలోచన మా ప్రభుత్వానికి ఉందన్నారు.
న్యాయపరమైన చిక్కులు రాకుండా అమలు చేసేలా అధ్యయనం చేసేందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రి వర్గ ఉపసంఘం వేసాశామన్నారు. 60 రోజుల్లో నివేదిక ఇవ్వాలని జ్యుడీషియల్ కమిషన్ ను కూడా నియమించామన్నారు రేవంత్ రెడ్డి.
మరో వారం రోజుల్లో నివేదిక ఇచ్చే అవకాశం ఉందన్నారు. సీఎం పేషీలో మాదిగలు ఉండాలని డా.సంగీతను నియమించడం జరిగిందన్నారు. వందేళ్ల ఉస్మానియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వీసీగా ఒక మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని నియమించామన్నారు.
IIT వీసీగా, విద్యా కమిషన్ మెబర్ గా, ఉన్నత విద్యా శాఖలో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం కల్పించామని తెలిపారు. పగిడి పాటి దేవయ్యని స్కిల్ యూనివర్సిటీ బోర్డు డైరెక్టర్ గా నియమించామన్నారు.