మైనార్టీల సమస్యలు పరిష్కరిస్తా
హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ ప్రతినిధులు , వివిధ సంఘాల బాధ్యులతో సీఎం భేటీ అయ్యారు. ప్రభుత్వ సలహాదారులు మొహమ్మద్ షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చూడాలని, మైనార్టీ పాఠశాలల అభివృద్దికి బడ్జెట్ కేటాయించాలని సీఎంకు మైనార్టీ ప్రతినిధులు విన్నవించారు. గతం ప్రభుత్వ హయాంలో మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్నారని ఆరోపించారు.
అంతే కాకుండా వక్ఫ్ భూములను కాపాడలేక పోయారని, రియల్ ఎస్టేట్ కు ఉపయోగించు కునేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వక్ఫ్ ఆస్తులను కాపాడాలని, ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని కోరారు.
ప్రతినిధులు ప్రస్తావించిన అన్ని అంశాల పట్ల తనకు అవగాహన ఉందని, సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనంటూ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.