అల్లు అర్జున్..రాణా సూపర్ స్టార్లు
హైదరాబాద్ – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నటులు అల్లు అర్జున్, దగ్గుబాటి రాణా లాంటి వారి పట్ల తనకు ఎలాంటి కోపం లేదని అన్నారు . ఆ ఇద్దరూ సూపర్ స్టార్లు అని, వారు తమకు గర్వ కారణమని కొనియాడారు. వాళ్లంతా తమ ముందు పెరిగిన వారేనని చెప్పారు. ఎలాంటి కోపం కానీ అంతకు మించిన ద్వేషం లేదన్నారు. సినీ పరిశ్రమ ఎక్కడికీ వెళ్లదని, సమస్యలను అన్నింటిని పరిష్కరిస్తామని ప్రకటించారు సీఎం.
సినిమాలకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహం ఇచ్చిందన్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు..పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి.
ఐటీ, ఫార్మా తో పాటుగా తమ ప్రభుత్వానికి సినిమా పరిశ్రమ కూడా అంతే ముఖ్యమని స్పష్టం చేశారు.
తెలంగాణలో అవార్డులు ఇవ్వడం లేదని తెలిసి గద్దర్ అవార్డును ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం, సినిమా పరిశ్రమకు అనుసంధానకర్తగా ఉండేందుకు దిల్ రాజును ఎఫ్ డిసి ఛైర్మన్ గా నియమించామన్నారు.
సినిమా పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. పరిశ్రమ కూడా ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో ఎక్కడైనా షూటింగ్ చేసుకుని హైదరాబాద్ కు రెండు గంటలల్లో రావొచ్చని అన్నారు సీఎం.
తెలంగాణ లోని ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని కోరారు. ముంబైలో వాతావరణం కారణం గా బాలీవుడ్ అక్కడ స్థిరపడిందన్నారు. కాస్మోపాలిటన్ సిటీల్లో హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెప్పారు. హాలివుడ్, బాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి.
హైదరాబాద్ లో పెద్ద సదస్సు ఏర్పాటు చేసి ఇతర సినిమా పరిశ్రమలను ఆకట్టునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. పరిశ్రమను నెక్ట్ప్ లెవల్ కు తీసుకెళ్లడమే తమ ఉద్దేశమన్నారు. గంజాయి, డ్రగ్స్ తో పాటు సామాజిక అంశాలపైన సినిమా పరిశ్రమ ప్రచారం చేయాలని కోరారు.
సినిమా పరిశ్రమ కు ఏది చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాలే చేశాయన్నారు. సినిమా స్టూడియోలకు స్థలాలు, నిర్మాణాలు, నివాస స్థలాలు, ఫిల్మ్ నగర్, చిత్రపురి కాలనీ, కార్మికులకు ఇండ్లు, ఇతర సౌకర్యాలు కల్పించిన విషయం మరిచి పోవద్దన్నారు. ముఖ్యమంత్రిగా చట్టాన్ని అమలు చేయాల్సిన భాద్యత తనపై ఉందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని సూచించారు.