నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం
విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్ – పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసమైందని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిని గాడిన పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రజా భవన్ లో నీటి పారుదల శాఖపై సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈనెల 12న సోమవారం ప్రత్యేకంగా నీటి పారుదల శాఖలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై విస్తృత స్థాయిలో పూర్తి వివరాలతో సహా తెలియ చెప్పేందుకు సిద్దమైంది ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
ఇందులో భాగంగా శాసన సభలో నీటి పారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. గత పదేళ్ల పాలనలో విధ్వంసమైన తెలంగాణ జల దృశ్యాన్ని జనం ముందు ఉంచేందుకు సిద్దమైనట్లు తెలిపారు. శాసన సభ్యులకు వాస్తవాలను వివరిస్తామన్నారు. శ్వేత పత్రానికి ఇది ట్రైలర్ మాత్రమేనని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.