దారుణాలపై సీఎం ఆగ్రహం
విచారణకు ఆదేశించిన రేవంత్
హైదరాబాద్ – రాష్ట్రంలో చోటు చేసుకున్న దారుణాలు, వరుస ఘటనలపై సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విచారణకు ఆదేశించారు. ఎవరైనా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించే ప్రసక్తి లేదని హెచ్చరించారు సీఎం.
ఈ మేరకు డీజీపీని ఆదేశిస్తూ కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆవేదన చెందారు. మరోసారి జరగకుండా చూడాలని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. శాంతి భద్రతల పట్ల ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు.
పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారానికి గురి కావడం, నారాయణపేట జిల్లాలో భూ తగాదా కారణంగా బహిరంగంగానే మనిషిపై దాడి చేసి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. సభ్య సమాజం తల దించుకోవాల్సిన పరిస్థితి ఎదురు కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించారు. భౌతిక దాడులకు దిగితే సహించ బోమన్నారు.