ప్రజా హిత పాలనే ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – పారదర్శకంగా ప్రజాహిత పాలనను అందించటమే తమ ప్రభుత్వం ఎంచుకున్న మొదటి ప్రాధాన్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల ప్రయోజనాలను అర్థం చేసుకొని పని చేయాలని కోరారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజ నర్సింహ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాద్యక్షుడు చిన్నారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. .తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత జిల్లా కలెక్టర్లతో ఇది రెండో సమావేశమని, ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరేనని సీఎం గుర్తు చేశారు. జిల్లా స్థాయిలో ప్రభుత్వానికి వారధులు.. సారధులు మీరేనని అన్నారు. ఇటీవలే రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమర్థులైన యువ కలెక్టర్లను నియమించామని, రాజకీయ ఒత్తిళ్లు, ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా కలెక్టర్ల బదిలీలు చేపట్టామన్నారు.
ఐఏఎస్ లకు సంబంధించి తమ కెరీర్ లో జిల్లా కలెక్టర్లుగా పని చేయటమే అత్యంత కీలకమైన అవకాశమని సీఎం అన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే బాధ్యతలతో పాటు క్షేత్ర స్థాయిలో అన్ని అంశాలపై అవగాహన వస్తుందని, జిల్లాల్లో పని చేసిన అనుభవమే భవిష్యత్తులో ఉపయోగ పడుతుందని అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను చివరి లబ్ధిదారుల వరకు చేర వేసే కీలక బాధ్యత కలెక్టర్లదేనని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కలెక్టర్లు ఏ జిల్లాలో పని చేసినా.. అక్కడి జిల్లా ప్రజల మదిలో చెరగని ముద్ర వేయాలని, తాము పని చేసే ప్రాంత ప్రజలందరి అభిమానాన్ని అందుకునేలా పని చేయాలని సీఎం అన్నారు.
వివిధ రాష్ట్రాల నుంచి వివిధ సంస్కృతుల నుంచి వచ్చిన ఐఏఎస్ అధికారులు తెలంగాణలో పని చేస్తున్నారని, విధి నిర్వహణలో భాగంగా ఇక్కడి భాష నేర్చుకుంటే సరిపోదని, భాషతో పాటు తెలంగాణ సంస్కృతిలో భాగస్వామ్యం కావాలని సూచించారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా భావించి పని చేయాలని, ఇక్కడి ప్రజలతో మమేకం కావాలని, ప్రయోజనం చేకూరేలా మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలన్నారు.
ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలు ఎప్పుడూ గుర్తు పెట్టుకునేలా ఐఏఎస్ లు పని చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ప్రజల ఆలోచన ఏమిటో తెలుసు కోవాలని.. కేవలం ఏసీ గదులకే పరిమితమైతే ఎలాంటి సంతృప్తి ఉండదని అన్నారు. తాము చేపట్టే ప్రతి పని.. ఇది ప్రజా ప్రభుత్వమని ప్రజలకు తెలిసేలా ఉండాలన్నారు.
జిల్లా కలెక్టర్లు అందరూ క్షేత్రస్ధాయిలో పర్యటించాల్సిందేనని ముఖ్యమంత్రి ఆదేశించారు. పాఠశాలలు, హాస్టళ్లు, ఆసుపత్రుల ద్వారా ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి పేద విద్యార్థిపై ప్రభుత్వం ప్రతి నెలా రూ.85 వేలు ఖర్చు పెడుతుందని అన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంతో పాటు పిల్లల భవిష్యత్తును నిర్దేశించే విద్యా వ్యవస్థను సమర్థంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. అందుకే ప్రభుత్వ స్కూళ్లు, ఆసుపత్రులను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని ఆదేశించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు ప్రజలతో మాట్లాడాలని, అక్కడికక్కడ పరిష్కారమయ్యే చిన్న చిన్న పనులను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
ప్రతి వారం నిర్వహించే ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారమైతే, హైదరాబాద్లో ప్రజాభవన్ కు వచ్చే అర్జీల సంఖ్య తగ్గిపోతుందని, అదే మీ పనితీరుకు అద్దం పడుతుందని సీఎం అన్నారు. ఆరు గ్యారంటీలను పారదర్శకంగా అమలు చేసే బాధ్యత కలెక్టర్లపైనే ఉందన్నారు.