ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – బీసీ కుల గణన అనేది ఒక సాహసోపేత నిర్ణయమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. త్రికరణ శుద్దిగా లెక్క తేల్చామని చెప్పారు. వందేళ్లలో జరగనిది తాము 100 శాతం సరైన లెక్కలు తేల్చామని స్పష్టం చేశారు. బీసీ కుల గణనకు సంబంధించిన నివేదికపై సమీక్ష చేపట్టారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఆదేశాలను పాటించానని అన్నారు. తప్పుడు లెక్క అనే వారిది తప్పుడు మాట అన్నారు రేవంత్ రెడ్డి.
బీసీల లెక్క తేలితే నష్ట పోయే రాజకీయ శక్తులే దీనిని వ్యతిరేకిస్తున్నాయని సంచలన ఆరోపణలు చేశారు సీఎం. తప్పుడు లెక్కలు అని ముద్ర వేసి బీసీలకు చారిత్రక ద్రోహం చేసే కుట్ర చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కుల గణన బీసీలకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ఆస్తి అని అన్నారు. ఈ ఆస్తిని కాపాడు కోవాల్సిన బాధ్యత బీసీలదేనని స్పష్టం చేశారు సీఎం. . రాజకీయ ప్రేరేపితానికి లోనైతే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని హెచ్చరించారు.
బీసీలు ఓన్ చేసుకోకపోతే ఈ లెక్కలు పట్టాలెక్కవు అన్నారు రేవంత్ రెడ్డి. కుట్రలను ఛేదించకపోతే బీసీలు శాశ్వతంగా నష్టపోతారని పేర్కొన్నారు.
మంచి చేసిన నన్నే రాళ్లతో కొడదామనుకుంటే నష్టపోయేది బీసీలేనని అన్నారు. కుల గణన వ్యతిరేకిస్తున్న వాడిని వదిలేసి… బీసీ లెక్కలు తేల్చిన మాపై ఆరోపణలు చేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టేనని, ఈ లెక్కలకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు.