నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. మరోసారి ఆయన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డిని టార్గెట్ చేశారు. రాష్ట్రానికి సంబంధించి విలన్ పీఎం మోదీ కాదని కేంద్ర మంత్రేనంటూ సంచలన ఆరోపణలు చేశారు. తను తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తున్నారని, ప్రాజెక్టులు, పనులకు అడ్డు తగులుతున్నాడని మండిపడ్డారు. పీఎం సానుకూలంగా ఉన్నా తను కావాలని అడ్డుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మెట్రో విస్తరణ పనులకు నిధులు ఇవ్వకుండా అడ్డు పుల్ల వేశాడని ధ్వజమెత్తారు సీఎం.
రాష్ట్రానికి రావాల్సిన నిధులను మంజూరు చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాల్సిన బాధ్యత గంగాపురం కిషన్ రెడ్డిపైనే ఉందన్నారు. తాను కోరిన ప్రతి పని పట్ల సపోర్ట్ గా నరేంద్ర మోదీ నిలిచారని కానీ కేంద్ర మంత్రే తనకు ఎక్కడ పేరు వస్తుందోనని తెలివిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న తను ఇలా చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
ఇప్పటికే బీఆర్ఎస్ కారణంగా రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని, కొత్తగా పనులు చేపట్టాలంటే ఇబ్బంది ఎదురవుతోందని, రాష్ట్రం నుంచి భారీ ఎత్తున జీఎస్టీ వసూలు అవుతున్నా ఎందుకని వివక్ష చూపిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి.