పిలుపునిచ్చిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి
చెన్నై – నియోజకవర్గాల పునర్విభజనపై మనందరిని ఏకతాటిపై తెచ్చిన సీఎం స్టాలిన్ ను అభినందిస్తున్నట్లు చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశం పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటోందన్నారు. బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు. 1971లో జనాభాను నియంత్రించాలని దేశం నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తే ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణలో విఫలమయ్యాయని మండిపడ్డారు.
దక్షిణాది రాష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సాధించాయి.. జీడీపీ, తలసరి ఆదాయం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణలో మంచి ప్రగతి సాధించాయన్నారు. దేశ ఖజానాకు మనం పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ తక్కువ మొత్తాన్ని పొందుతున్నామన్నారు సీఎం. తమిళనాడు పన్నుల రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తుంటే… ఉత్తర ప్రదేశ్‌కు రూపాయికి రెండు రూపాయల 73 పైసలు వెనక్కి వెళుతున్నాయని ఆరోపించారు.
బీహార్ రూపాయి చెల్లిస్తే రూ. 6.06 వెనక్కి పొందుతోంది. రూపాయిలో కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెనక్కి వస్తున్నాయి. అదే సమయంలో మధ్య ప్రదేశ్ రూపాయి పన్ను రూపంలో కేంద్రానికి ఇస్తే.. రూ. 1.73 పైసలు వెనక్కు పొందుతోంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయింపులు.. పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోందని మండిపడ్డారు.. చివరకు జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉత్తరాది రాష్ట్రాలకే 60 నుంచి 65 శాతం నిధులు దక్కుతున్నాయని ఆరోపించారు.
ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలన్నారు. 1976లో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అలానే పునర్విభజన చేపట్టింది. లేకుంటే రాష్ట్రాల మధ్య రాజకీయ తేడాలు వచ్చేవన్నారు. జనాభా దామాషా ప్రాతిపదిక పునర్విభజను దక్షిణాది వ్యతిరేకిస్తోందన్నారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చెలాయిస్తాన్నారు.