మోడీ సర్కార్ పై భగ్గుమన్న ఎ. రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఓ ఛానల్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. మోడీ సర్కార్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఎక్కువ శాతం పన్నులకు సంబంధించి ఆదాయం దక్షిణాది రాష్ట్రాల నుంచి వెళుతోందని అన్నారు. కానీ తమ వాటా తమకు దక్కడం లేదన్నారు సీఎం.
ప్రధానంగా పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధుల విషయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తోందని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశం ప్రగతి బాటలో పయనించడానికి అన్ని రాష్ట్రాలు సమంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో భాగంగా మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్, ఫ్యూచర్ సిటీ ఆలోచనలను వివరించారు సీఎం. సబర్మతి రివర్ ఫ్రంట్‌కు మద్దతునిస్తున్న వారు మూసీ పురుజ్జీవాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆక్షేపించారు.
మూసీ, ఈసా నదుల కలయిక ప్రాంతమైన బాపూ ఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమంగా గాంధీ స్మారకాన్ని నిర్మించతలపెట్టామని ప్రకటించారు రేవంత్ రెడ్డి. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ ప్రధానులు దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితాలను వివరించారు.
ప్రధానంగా బహుళార్థ సాధక ప్రాజెక్టులు, విద్య, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, 73-74 వ రాజ్యాంగ సవరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన విప్లవం, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పన, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఏ విధంగా తోడ్పడిందనే దానిని వివరించే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి.
ఎంతో మంది యువకుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని , అయితే ప్రగతి విషయంలో కొందరు కావాలని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.