ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కామెంట్స్
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కలెక్టర్లు, ఎస్పీలను ఎక్కడికైనా బదిలీ చేయగలమని, కానీ టీచర్లను ట్రాన్స్ ఫర్ చేయలేమంటూ పేర్కొన్నారు. ఉద్యమానికి ఊపిరిలూదిన యూనివర్సిటీలు, కాలేజీలు ఈరోజు డ్రగ్స్, గంజాయికి బానిసలవుతున్నాయని ఆవేదన చెందారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత చెడ్డదారి పడుతున్నారని వాపోయారు. నిరుద్యోగులు రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు సీఎం.
తమ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో 57924 ఉద్యోగాలు పారదర్శకంగా ఇచ్చామన్నారు. ఎలాంటి ఆరోపణలు ఇప్పటి వరకు రాలేదన్నారు. 20 ఏళ్లుగా ప్రమోషన్లు లేని 22 వేల మంది టీచర్లను బదిలీ చేశామన్నారు. పదేళ్లుగా బదిలీలు లేని 36 వేల మంది టీచర్లను ట్రాన్స్ ఫర్ చేసిన ఘనత తమదేనని అన్నారు. ఇక ధరల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నం.1 గా ఉందన్నారు. కేరళలో 7.1% గా ఉందన్నారు. నిరుద్యోగిత రేటును 8.8% నుంచి 6.1% కు తగ్గించామని చెప్పారు సీఎం. అంతే కాదు జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ టాప్ లో కొనసాగుతోందన్నారు.
88 శాతం పన్నుల వసూళ్లతో తెలంగాణ ఉండగా 86 శాతం మహారాష్ట్ర రెండో స్థానంలో ఉందన్నారు సీఎం. నెల రోజుల్లో ఇసుక ఆదాయాన్ని డబుల్ చేశానని చెప్పారు. ఆనాడు రోజుకు ఇసుక మీద కోటి 25 లక్షలు వచ్చేదని, కానీ తాను వచ్చాక రోజుకు రూ. 3 కోట్లకు పెరిగిందన్నారు. రాజీవ్ యువ వికాసం కింద రూ. 6 వేల కోట్ల రుణాలు ఇస్తున్నామన్నారు.