రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులు
ఎందుకు ఉండాలన్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా ఆయన నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్నంత ఈ దేశంలో ఎవరూ దోచు కోలేదన్నారు. చివరకు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను సైతం నిర్వీర్యం చేసిన ఘనత ఈ మహానుభావుడికే దక్కుతుందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర చిహ్నంలో సైతం తెలంగాణ ఆనవాళ్లు లేకుండా చేశారని మండిపడ్డారు. ఇందులో కూడా రాచరికపు వాసనలే ఉన్నాయని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చిహ్నం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో బానిసత్వపు ఆనవాళ్లు ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు బాగానే ఉన్నారని, కానీ బీఆర్ఎస్ వాళ్లే ఆటోను తీసుకు వచ్చి తగుల బెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రామాలు బంద్ చేస్తే మంచిదని లేక పోతే బీఆర్ఎస్ ఖాళీ కాక తప్పదన్నారు రేవంత్ రెడ్డి.