నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి
వికారాబాద్ జిల్లా – సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కోడంగల్ లోని తన నివాసంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ జిల్లా సన్నాహక సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. అమిత్ షాను ఏకి పారేశారు. పార్లమెంటులో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ను అవమానించేలా మాట్లాడారని ఆరోపంచారు.
మహాత్మా గాంధీని చంపిన వారిని ప్రోత్సహించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయంటూ మండిపడ్డారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అందించడం వల్లే దేశంలో సామాజిక పరివర్తన జరిగిందన్నారు. ప్రజలు కనిపించని దేవుడిగా అంబేద్కర్ ను కొలుస్తున్నారని చెప్పారు.
ప్రతీ గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకుని ఆయనను ఆరాధిస్తున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి మహనీయుడిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ప్రతీ చోట సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ విధంగా అంబేద్కర్ స్ఫూర్తిని చాటుతున్నామని అన్నారు. దేశంలో చిల్లర రాజకీయాలు చేస్తోందంటూ కేంద్ర సర్కార్ పై తీవ్ర స్తాయిలో సంచలన ఆరోపణలు చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఇప్పుడు ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.