కేసీఆర్..మోదీ డ్రామా చెల్లదు
సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో మైలేజ్ రాకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్, పీఎం నరేంద్ర మోదీ కలిసి ఆడుతున్న నాటకమే కవిత అరెస్ట్ వ్యవహారం అని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి శనివారం మీడియాతో మాట్లాడారు. ఈ చిల్లర రాజకీయాలను ప్రజలు విశ్వసించే స్థితిలో లేరన్నారు . బీఆర్ఎస్ బీజేపీకి బి టీమ్ అనేది జగమెగిరిన సత్యమని, ఇది దేశ వ్యాప్తంగా ప్రతి పార్టీకి తెలుసన్నారు.
ఎవరు ఎవరిని రాసుకుని పూసుకుని తిరిగారో, ఎవరు ఎవరికి బిల్లులకు మద్దతు ఇచ్చారో 143 కోట్ల ప్రజానీకానికి అర్థమైందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ, కేసీఆర్ ఆడుతున్న నాటకం రక్తి కట్టిందని అనుకున్నారని కానీ అది ఫెయిలైన ప్లాన్ అంటూ సెటైర్ వేశారు.
ఏనాడూ ఇన్నేళ్లుగా పాలించిన బీజేపీ ఎవరి మీద చర్యలు తీసుకుందో చెప్పాలన్నారు . అక్రమార్కులు దేశం దాటి వెళ్లి పోయారని, ఎవరైతే దేశాన్ని నిట్ట నిలువునా మోసం చేశారో వారే ఇవాళ బీజేపీకి ఎలోక్టరల్ బాండ్ల రూపంలో రూ. 6,000 కోట్లకు పైగా విరాళంగా అందజేశారని ఇక మోదీని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.