NEWSTELANGANA

తెలంగాణ‌పై క‌క్ష ఎందుకింత వివక్ష

Share it with your family & friends

నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – కేంద్ర బ‌డ్జెట్ లో క‌నీసం తెలంగాణ పేరు లేకుండా పోవ‌డం ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అస‌లు ఈ దేశంలో లేనే లేద‌ని అనుకున్నారా అంటూ ప్ర‌శ్నించారు మోడీని.

ఇతర రాష్ట్రాల కేటాయింపులపై తమకు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌న్నారు. \విభజన చట్టంలో పొందు పరిచిన మేరకు ఆంధ్రప్రదేశ్‌కు నిధులు కేటాయించినప్పుడు అదే చట్టంలో పేర్కొన్న తెలంగాణ అంశాలపై ఎందుకు వివక్ష చూపించారంటూ ప్ర‌శ్నించారు రేవంత్ రెడ్డి.

ఎందుకు నిధులు కేటాయించ లేక పోయారంటూ నిల‌దీశారు. దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని ఆరోపించారు. ఆ వివక్షపై దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాటం చేస్తామ‌ని అన్నారు. కలిసొచ్చే ప్రభుత్వాలతో త‌మ‌ వైఖరిని కేంద్రానికి స్పష్టంగా చెబుతామ‌ని అన్నారు.

ప్రధానంగా బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, ఐఐఎం ఏర్పాటు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌కు నిధులు, రీజినల్ రింగ్ రోడ్డు, మెట్రో విస్తరణ, పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్‌పోర్ట్, మరుగున పడిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు పునరుద్ధరణ, రైతులకు ప్రత్యేక కార్యాచరణ, వైద్య ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పనలో తెలంగాణకు ఏవీ ఇవ్వలేదన్నారు.

ప్రతి రాష్ట్రంలో ఐఐఎం ఏర్పాటు చేయాలని సంకల్పించిన నేపథ్యంలో తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని స్వయంగా ప్రధానమంత్రి గారిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు సీఎం. కానీ తెలంగాణకు ఐఐఎం ఇవ్వబోమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాయ‌డం దారుణ‌మ‌న్నారు.