NEWSTELANGANA

దోచుకున్న సొమ్ములో రూ. 2 వేల కోట్లు ఇవ్వండి

Share it with your family & friends

క‌ల్వ‌కుంట్ల ఫ్యామిలీపై నిప్పులు చెరిగిన సీఎం

ఖ‌మ్మం జిల్లా – తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ వైపు వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే బీఆర్ఎస్ పార్టీ నేత‌లు నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

గ‌త 10 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏలిన క‌ల్వ‌కుంట్ల కుటుంబం దోచుకున్న ల‌క్ష కోట్ల రూపాయ‌ల లోంచి క‌నీసం ప్ర‌జ‌ల‌కు రూ. 2 కోట్లు సాయం చేయాల‌ని డిమాండ్ చేశారు. కేటీఆర్ అమెరికాలో ఉంటూ అక్క‌డ ఎంజాయ్ చేస్తూ ఇక్క‌డ ప‌ని చేస్తున్న త‌మ‌ను కామెంట్ చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు.

ప‌క్క రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నేత ప‌రామ‌ర్శిస్తుంటే ఇక్క‌డ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కే ప‌రిమితం అయ్యారంటూ ఎద్దేవా చేశారు. ఆధారాలు లేకుండా విమ‌ర్శ‌లు చేస్తూ చూస్తూ ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు సీఎం రేవంత్ రెడ్డి.

రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాల బాధ్యతాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌ని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తాము పని చేయ‌మ‌ని అన్నారు. వర్షాల కారణంగా జనం సర్వం కోల్పోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిల్లిగవ్వ కూడా కల్వకుంట్ల కుటుంబం ఇవ్వదన్నారు.

దోచుకున్న రూ. లక్షల కోట్ల సొమ్ములో రూ. వెయ్యి కోట్లో.. రూ. రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వవచ్చు కదా అని ప్ర‌శ్నించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తామ‌న్నారు.

పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు ఇస్తామ‌ని , నష్ట పోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ. 10 వేలు ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. యుద్ద ప్రాతిప‌దిక‌న సాయం చేసేందుకు ప్ర‌తి జిల్లాకు రూ. 5 కోట్లు ఇచ్చామ‌ని తెలిపారు సీఎం.