NEWSTELANGANA

ఆక్ర‌మ‌ణ‌దారుల భ‌ర‌తం ప‌డ‌తాం – సీఎం

Share it with your family & friends

ఒత్తిళ్ల‌కు త‌ల వంచే ప్ర‌స‌క్తి లేదన్న రేవంత్

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆక్ర‌మ‌ణ‌దారుల ప‌ట్ల కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప్ర‌స్తుతం అక్కినేని నాగార్జున‌తో పాటు బ‌డా బాబులు అక్ర‌మంగా క‌ట్టుకున్న నిర్మాణాల‌ను హైడ్రా కూల్చి వేస్తూ పోతోంది. దీనిపై వ‌స్తున్న విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌ల‌పై స్పందించారు రేవంత్ రెడ్డి.

ఆదివారం సీఎం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లేక్ సిటీ.. గండిపేట, ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చుతున్నాయ‌ని చెప్పారు . కొందరు ధనవంతులు చెరువుల పక్కనే ఫాంహౌస్ లు కట్టుకున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

ఆ ఫాంహౌస్ నాలాలు గండిపేటలో కలిపారని పేర్కొన్నారు సీఎం.. చెరువుల్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత భవిష్యత్ తరాల కోసం చేపట్టామ‌ని చెప్పారు.. హైదరాబాద్ ను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి పైనా ఉందన్నారు సీఎం.

ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామ‌ని, ఎక్క‌డా త‌ల వంచే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు.