కరెంట్ కట్ చేస్తే సస్పెండ్
హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – రాష్ట్రంలో ఎక్కడైనా , ఎప్పుడైనా కరెంట్ పోయిందని తెలిస్తే ఆ ఏరియాలో పని చేస్తున్న సిబ్బందిని సస్పెండ్ చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలను సహించేది లేదని హెచ్చరించే ప్రసక్తి లేదన్నారు. ఎక్కడైనా అకారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పుడున్న అవసరాలకు సరిపడేంత విద్యుత్తును ప్రభుత్వం సరఫరా చేస్తోందని, ప్రభుత్వం తరఫున ఎక్కడా విద్యుత్తు కోతలను విధించటం లేదని సీఎం స్పష్టం చేశారు.
గతంతో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా పెరిగిందని చెప్పారు. ఇటీవల పలు చోట్ల విద్యుత్తు సరఫరా నిలిపేసిన సంఘటనలపై రేవంత్ రెడ్డి విద్యుత్తు శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.
సచివాలయంలో గృహజ్యోతి, రూ.500కే సిలిండర్ పథకాలపై సమీక్షకు ముందు ముఖ్యమంత్రి విద్యుత్ కోతలపై సాగుతున్న ప్రచారంపై అధికారులను ప్రశ్నించారు. గతేడాదితో పోల్చితే గత రెండు నెలల్లో విద్యుత్ సరఫరా ఎక్కువగా చేసినట్లు ట్రాన్స్ కో జెన్ కో సీఎండీ రిజ్వీ సమాధానమిచ్చారు.
ఇటీవల రాష్ట్రంలో మూడు సబ్ స్టేషన్ల పరిధిలో కొంత సేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని తెలిపారు. దానికి కారణాలు ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సబ్ స్టేషన్లలో లోడ్ హెచ్చుతగ్గులను డీఈలు సరి చూసుకుంటూ ఉండాలని, అలా చూసుకోక పోవడంతో సమస్య తలెత్తిందని తెలిపారు.
ఏవైనా మరమ్మతులు, ఇతర అంశాలకు సరఫరా నిలిపివేయాల్సి వస్తే ముందుగానే ఆయా సబ్ స్టేషన్ల పరిధిలోని వినియోగదారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో నియమితులైన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు ఉద్దేశ్యపూర్వకంగా కోతలు పెడుతున్నారనే సమచారం తమకు ఉందని సీఎం హెచ్చరించారు.