NEWSTELANGANA

ప్ర‌జ‌ల‌ను వేధిస్తే వేటు త‌ప్ప‌దు

Share it with your family & friends

సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

హైద‌రాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది ప్ర‌జ‌ల కోసం ఏర్ప‌డిన ప్ర‌భుత్వ‌మ‌ని, ఎవ‌రైనా అతిగా ప్ర‌వ‌ర్తిస్తే వారిపై వేటు త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు. ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పెట్టే ప‌ని ఎవ‌రు చేసినా లేదా చ‌ర్య‌లు చేప‌ట్టినా ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌న్నారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజా పాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు వచ్చింది. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు..? తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చింది ఎవరు…? అని సమీక్షలో ఉన్న ట్రాన్స్ కో సీఎండీ రిజ్విని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా? లేదా? అని ఆరా తీశారు.

దీనిపై స్పందించారు డిప్యూటీ సీఎం భ‌ట్టి. కరెంట్ కనెక్షన్ల తనిఖీ, సర్వే చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని సీఎంకు వివరించారు. శాఖా పరమైన నిర్ణయమేదీ లేకుండానే డిస్కం డైరెక్టర్ (ఆపరేషన్స్) జె. శ్రీనివాసరెడ్డి సొంతంగా ఆదేశాలు ఇచ్చాడని తెలిపారు.

ఆయన ఆదేశాల మేరకు అక్కడున్న ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి ఈ చర్యకు పాల్పడినట్లు వివ‌రించారు. ఈ వ్యవహారంలోనే డైరెక్టర్ శ్రీనివాసరెడ్డిని విధుల నుంచి తొలిగించామని, ఎస్ఈని అక్కడి నుంచి బదిలీ చేశామని ఉప ముఖ్యమంత్రి జరిగిన సంఘటనను మొత్తం వివరించారు.