ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ సాంస్కృతిక శిఖరం ప్రజా యుద్ద నౌక గద్దర్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన లేక పోతే రాష్ట్రం వచ్చి ఉండేది కాదన్నారు. తొలి దశ ఉద్యమంలోనూ..మలి దశ పోరాటంలోనూ కీలకమైన పాత్ర పోషించారని కొనియాడారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.
ప్రపంచంలో ఏ గాయకుడు కూడా తూటాలు శరీరంలో పెట్టుకుని ఆడ లేదని, పాటలు పాడలేదని ప్రశంసించారు. గద్దర్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు. అందుకే గద్దర్ కు నివాళిగా సర్కార్ అధికారికంగా జయంతుత్సవాలు నిర్వహిస్తోందన్నారు.
తమ ప్రజా ప్రభుత్వం ప్రజా గాయకుడికి ఎనలేని గౌరవాన్ని ఇస్తోందన్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్న కూతురు వెన్నెల గద్దర్ కు తెలంగాణ సాంస్కృతిక సారథి సంస్థకు చైర్ పర్సన్ గా నియమించడం జరిగిందని చెప్పారు రేవంత్ రెడ్డి.
త్వరలోనే గద్దర్ తనయుడికి కూడా తగిన రీతిలో గుర్తింపు ఇస్తామన్నారు. గద్దర్ తెలంగాణకే కాదు యావత్ ప్రపంచాన్ని తన ఆట, పాటలతో కొన్ని తరాల పాటు గుర్తు పెట్టుకునేలా స్పూర్తి నింపారని అన్నారు సీఎం.