గ్రామీణ క్రీడలపై దృష్టి సారించాలి
శాట్ నూతన లోగోను ఆవిష్కరణ
హైదరాబాద్ – రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో క్రీడలను అభివృద్ది చేసేందుకు కృషి చేయాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సచివాలయంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు సంబంధించి కొత్తగా తయారు చేసిన లోగోను ఆవిష్కరించారు.
జీవితం కోసం క్రీడలు అనే ట్యాగ్ లైన్ తో దీనిని తయారు చేశారు. ఈ సందర్భంగా సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నినాదం తనకు నచ్చిందని, అద్భుతంగా తయారు చేశారంటూ కితాబు ఇచ్చారు. ఇలాంటి సృజనాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు.
గత ప్రభుత్వం క్రీడలను పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచే క్రీడల పట్ల పిల్లలకు ఆసక్తిని పెంపొందంచేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఎ. రేవంత్ రెడ్డి. క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక బలాన్ని కూడా ఇస్తాయని చెప్పారు.
ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఆముదాలపాడు జితేందర్ రెడ్డి, శాట్ చైర్మన్ శివ సేనా రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలా దేవి పాల్గొన్నారు.