కాలుష్య రహిత నగర నిర్మాణంపై ఫోకస్
త్వరలోనేనన్న సీఎం రేవంత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఆయన పాలనా పరంగా ఎక్కువగా పనుల నిర్మాణం, ప్రగతిపై ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా విద్యా, నిర్మాణ రంగాలలో కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో రియల్ ఎస్టేట్ పరంగా అధికంగా ఆదాయం ఎలా పొందాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. పదే పదే సమీక్షలు చేస్తూ నగరాన్ని ప్రపంచంలో అద్భుతమైన సిటీగా మార్చే పనిలో పడ్డారు.
తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో జనాభా పెరిగి పోయింది. ఐటీ, లాజిస్టిక్, వ్యాపార రంగాలకు చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున కొలువు తీరాయి. లక్షలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వీటిపై ఆధారపడి బతుకుతున్నారు.
ఎక్కడ చూసినా ఆకాశాన్ని తాకేలా అపార్ట్ మెంట్లు, విల్లాలు పుట్టుకు వచ్చాయి..ఇంకా నిర్మాణం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో వాహన కాలుష్యం పట్టి పీడిస్తోంది. దీంతో సీఎంగా కొలువు తీరిన వెంటనే రేవంత్ రెడ్డి కాలుష్య రహిత నగరంగా మార్చాలని కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ శివారులో అద్భుతమైన నగర నిర్మాణానికి ప్లాన్ చేయాలని ఆదేశించారు. కల్వకుర్తి పర్యటనలో భాగంగా ఆయన రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో నెట్ జిరో సిటీ స్థలాన్ని పరిశీలించారు. ఆయన వెంట మంత్రి దామోదర రాజ నరసింహ ఉన్నారు.