NEWSTELANGANA

రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ

Share it with your family & friends

ద‌ర్యాప్తు చేయాల‌ని సీఎం ఆదేశం

హైద‌రాబాద్ – హైద‌రాబాద్ న‌గ‌రానికి వెలుపల ఉన్న అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వానికి రావాల్సిన భారీ ఆదాయానికి గండి పడేలా తక్కువ రేటుకు టెండర్లు కట్ట బెట్టిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కనీస రేట్ నిర్ణయించకుండా టెండర్లు ఎలా పిలిచారని హెచ్ఎండీఏ అధికారులను ప్రశ్నించారు. అందులో ఎవరెవరి ప్రమేయముంది.. ఏయే సంస్థలున్నాయి.. ఎవరెవరు బాధ్యులెవరో అన్ని కోణాల్లో దర్యాప్తు జరపాలని అన్నారు రేవంత్ రెడ్డి.

ఈ టెండర్లలో జరిగిన అవకతవకలు, అనుసరించిన విధానాలు, ఫైళ్లు కదిలిన తీరుపై పూర్తి వివరాలను సమర్పించాలని హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ అమ్రా పాలీ కి బాధ్యతలు అప్పగించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన ఫైళ్లు ఏవైనా మిస్సయినట్లు గుర్తిస్తే.. వెంటనే సంబంధిత అధికారులు, బాధ్యులైన ఉద్యోగులపై వ్యక్తిగతంగా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

హెచ్ఎండీఏ నుంచి పూర్తి నివేదిక అందిన తర్వాత కేబినేట్ లో చర్చించి ఈ టెండర్ల వ్యవహారాన్ని సీబీఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థకు అప్పగిస్తామని సీఎం చెప్పారు.