వీటీ రాజశేఖర్ మృతి తీరని లోటు – సీఎం
దళిత వాయిస్ ఎడిటర్ కు సిద్దరామయ్య నివాళి
కర్ణాటక – ప్రముఖ జర్నలిస్ట్ దళిత్ వాయిస్ పత్రిక సంపాదకుడు వీటీ రాజశేఖర్ కన్ను మూశారు. బుధవారం మంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతితో దేశం దళిత, బహుజన, గిరిజన , తాడిత, పీడిత వర్గాలు శోక సంద్రంలో మునిగి పోయాయి. తన జీవిత కాలమంతా అణగారిన ప్రజల గొంతుకను వినిపించే ప్రయత్నం చేశారని అన్నారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. వీటీ రాజశేఖర్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.
కుల వ్యవస్థ, మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చురుకైన న్యాయవాదిగా, జర్నలిజం వృత్తిని క్రియాశీలత స్ఫూర్తితో నడిపించారని గుర్తు చేసుకున్నారు సీఎం. రాజశేఖర్‌తో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ, దళిత్ వాయిస్‌ని ప్రారంభించినప్పటి నుంచి తనకు పరిచయమున్న మార్గదర్శిగా, సీనియర్ శ్రేయోభిలాషిగా అభివర్ణించారు.
రాజశేఖర్ మరణం సమాజానికి తీరని లోటు మాత్రమే కాకుండా ప్రగతిశీల ఆలోచనా రంగంలో పూడ్చలేని శూన్యాన్ని సృష్టిస్తుందని సిద్ధరామయ్య పేర్కొన్నారు.
దళిత్ వాయిస్ పత్రిక ద్వారా దళితుల సమస్యలను ప్రచురించి దేశ వ్యాప్తంగా దళిత వర్గాలను చైతన్య వంతం చేశారు వీటీ రాజశేఖర్. ఆయన పూర్తి పేరు వొంటిబెట్టు తిమ్మప్ప రాజశేఖర్ శెట్టి. 1932లో పుట్టారు. దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పత్రికగా గుర్తింపు పొందింది.
వీటి రాజశేఖర్ 25 ఏళ్ల పాటు ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికలో పని చేశారు. దళిత ఉద్యమానికి తన పత్రిక ద్వారా ఊపిరి పోశారు. 1981లో దీనిని ప్రారంభించారు. 1986లో హిందూ మతానికి వ్యతిరేకంగా రాసినందుకు గాను వీటీ రాజశేఖర్ పాస్ పోర్టును జప్తు చేశారు. తీవ్రవాదానికి మద్దతు తెలియ చేస్తున్నాడని ఆయనను అరెస్ట్ చేశారు.
ఆయన రాసిన కరపత్రాలు, పుస్తకాలు ఎంతో ఆలోచింప చేశాయి. కర్ణాటకలో దళితుల ఉద్యమం, హిందూ భారతంలో మార్క్స్ ఎలా మరణించాడు, గాడ్సే గాంధీని ఎందుకు చంపాడు, హిందూ పాము..ముస్లిం ముంగీస, భూ దేవతల సంభాషణ, చరిత్ర తీర్పు, భారత దేశంలో వర్ణ వివక్ష అనేవి అత్యంత ఆదరణ పొందాయి.