ఇండియా కూటమిదే విజయం
సీఎం సిద్దరామయ్య ధీమా
మైసూరు – కర్ణాటక సీఎం సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాలతో కూడిన ఇండియా కూటమికి ఢోకా లేదన్నారు. ఈ దేశంలో మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయంగా పబ్బం గడుపుకునే భారతీయ జనతా పార్టీకి ఈసారి ఎన్నికల్లో షాక్ తగల బోతోందన్నారు.
దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన కూడా బీజేపీకి ఎదురు గాలి వీస్తోందని చెప్పారు. కర్ణాటకలో కొలువు తీరిన తాము ఇచ్చిన హామీలను అమలు చేయడం జరిగిందని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన పాలన అందజేస్తున్నామని తెలిపారు.
బీజేపీని వ్యతిరేకించే పార్టీలు కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ముందుకు నడుస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని , ఇక ఎలక్టోరల్ బాండ్ల స్కీం ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద అధికారిక కుంభకోణమని సంచలన ఆరోపణలు చేశారు సిద్దరామయ్య.
ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం బీజేపీని వ్యతిరేకించిన వారిలో ఉన్నారని, వారంతా కలిసి వస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు సీఎం.