యూపీ సీఎం యోగి ఆదిత్యా నాథ్
ఉత్తర ప్రదేశ్ – మహా కుంభ మేళాలో జరిగిన తొక్కిసలాటలో 20 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. దీనిపై స్పందించిన సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందన్నారు. దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. ప్రధానమంత్రి తనతో నాలుగుసార్లు ఫోన్ లో మాట్లాడారని చెప్పారు. గవర్నర్ తో పాటు తాను కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని, బాధితులకు మెరుగైన వైద్యం అందజేస్తున్నట్లు తెలిపారు.
సమీపంలో ఏర్పాటు చేసిన ఘాట్లలోనే స్నానాలు చేయాలని భక్తులను కోరారు. ప్రభుత్వంతో సహకరించాలని విన్నవించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర బలగాలు రంగంలోకి దిగాయని చెప్పారు. సహాయక చర్యలను ముమ్మరం చేశారని చెప్పారు సీఎం.
త్రివేణి సంగమ ముఖ ద్వారం వద్దకే వెళ్లి పుణ్య స్నానాలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎక్కడ చేసినా ఒక్కటేనని పేర్కొన్నారు. నదులలో తమకు వీలు కుదిరిన ఘాట్ల వద్ద స్నానాలు చేయాలని సూచించారు యోగి ఆదిత్యానాథ్. దీని వల్ల రద్దీ తగ్గుతుందన్నారు. ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు.
మరో వైపు తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఆరా తీశారు కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా. కేంద్రం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.