కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరిక
హైదరాబాద్ – హైడ్రా పేరు చెప్పి లావాదేవీలకు, అవకతవకలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలుంటాయని హైడ్రా హెచ్చరించింది. ఈ మేరకు గతేడాది సెప్టెంబరు 3వ తేదీన హైడ్రా స్పష్టమైన ప్రకటన చేసిందని, అవకతవకలు జరిగినట్టు ఆధారాలుంటే వెంటనే తన దృష్టికి తీసుకు రావాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. లేని పక్షంలో ఏసీబీ, విజిలెన్స్ ఎన్‌ఫోర్సుమెంట్ విభాగానికి, స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అవకతవకలు నిజమైన పక్షంలో హైడ్రా ఉద్యోగులైతే సస్పెండ్ చేయడంతో పాటు..కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
ప్రత్యక్షంగా కాని.. పరోక్షంగా కాని హైడ్రా పేరును వినియోగించుకుని వసూళ్లకు పాల్పడినా, అవకతవకలు చేసినా వారి పైనా చర్యలు తప్పవన్నారు. ఇప్పటికే పలువురిపై కేసులు కూడా పెట్టామన్నారు. నోటీసులు ఇచ్చి హైడ్రా లావాదేవీలు చేస్తున్నట్టు ఏవైనా ఫిర్యాదులుంటే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి తమ దృష్టికి కాని, ఏసీబీ, విజిలెన్స్, పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లవచ్చన్నారు.
ఫోన్‌లు వస్తే వెంటనే మాట్లాడి సమస్య తెలుసుకోవడం. ఒక వేళ సమావేశాల్లో ఉన్నప్పుడు ఫోను లిఫ్ట్ చేయలేక పోయినా.. ఫిర్యాదుదారులు మెసేజ్ పెడితే స్పందించడం సర్వసాధరణంగా జరుగుతుందన్నారు హైడ్రా కమిషనర్. ప్రతి సోమవారం. పని దినాల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు.